అమిత్ షా ఎంట్రీతో బీజేపీ మంత్రులపేర్లు ఛేంజ్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..24 మంది మంత్రుల జాబితా ఖరారైంది. ఈ రోజు మొత్తం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. కూటమిలోని మూడు పార్టీల నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ తుది కూర్పు చంద్రబాబు పూర్తి చేసారు. జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ నుంచి మాత్రం చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
మంత్రివర్గం సిద్దం
ఏపీలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి (సత్యకుమార్).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు.

సమీకరణాలే కీలకం
ఉమ్మడి జిల్లాలవారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. ఇక...మంత్రివర్గంలోని వారి పేర్లు ప్రకటనకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు..మంత్రివర్గం పైన చర్చలు జరిగాయి. ఏపీలో మంత్రివర్గం కూర్పు పైన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా..తమకు సమ్మతమేనని బీజేపీ ముఖ్యులు స్పష్టం చేసారు. బీజేపీ నుంచి తొలుత ఇద్దరికి అవకాశం ఇస్తారని భావించారు.

బీజేపీ నుంచి ఒక్కరికే
బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో సజా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్ లో ఒకరికి అవకాశం దక్కుతుందని..అదే విధంగా రెండో మంత్రి పదవి సత్యకుమార్ కు ఇస్తారని అంచనా వేసారు. కానీ, తుది జాబితాలో బీజేపీ నుంచి కేవలం సత్యకుమార్ కు మాత్రమే అవకాశం దక్కింది. కేంద్ర కేబినెట్ లోనూ ఏపీ బీజేపీ నుంచి అనూహ్యంగా శ్రీనివాస వర్మకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోనూ అమిత్ షా.. బీజేపీ హైకమాండ్ తో సత్పంబంధాలు..పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన సత్యకుమార్ కు ఖాయమైంది. అయితే, టీడీపీలోనూ మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఇక..ఇప్పుడు పవన్ తో సహా మంత్రులకు ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications