టీటీడీకి డొనేషన్ల వెల్లువ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 59,834 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,628 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.

కాగా తిరుమల ప్రస్తుతం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధమౌతుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 24న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో ఆలయం నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను చేపట్టారు. గ్యాలరీల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ పరిస్థితుల మధ్య టీటీడీకి భారీగా విరాళాలు అందుతున్నాయి. టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు 1,00,50,000 రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.
అంతకుముందు- టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు విరాళం అందించారు. ఆర్ఎస్ బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది. బెంగళూరుకే చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాఘవేంద్రఅన్నమయ్య భవనంలో అదనపు ఈఓకు డీడీను అందజేశారు.
రాజస్థాన్‌కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ రూ.10,59,000, కోనసీమ జిల్లాకి చెందిన దండుమేను శశాంక్ కృష్ణ రూ.10,00,006 విరాళంగా అందించారు. విజయవాడలోని ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ కు చెందిన కోమటి సునీల్ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,50,001 విరాళం అందించారు. తాడేపల్లిగూడేనికి చెందిన శ్రీమతి మాతురు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications