వైసీపీ ఎంపీ అభ్యర్ధికి ఇంటిపోరు ? ఓటేయొద్దంటూ కొడుకు ప్రచారం..!
ఏపీలో ఎన్నికల వేళ పలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల్లో బరిలోకి దిగిన తమ కుటుంబ సభ్యులకు ఓటేయమంటూ పలువురు అభ్యర్ధుల కుటుంబ సభ్యులు నిత్యం జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తుంటే ఇందుకు భిన్నంగా ఓ వైసీపీ ఎంపీ కుమారుడు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆయనకు ఓటేయొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఈ రాజకీయం ఏంటని జనం చెవులు కొరుక్కుంటున్నారు.
అనకాపల్లి లోక్ సభ స్ధానం నుంచి తొలిసారి వైసీపీ ఎంపీగా బరిలోకి దిగిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడికి సన్ స్ట్రోక్ తగులుతోంది. సన్ స్ట్రోక్ అంటే వడగాల్పు అనుకునేరు.. కాదు కొడుకు పోరు. అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగిన ముత్యాల నాయుడికి ఓటేయొద్దంటూ ఆయన కుమారుడు రవి కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన పోస్టర్లను కూడా విడుదల చేస్తున్నారు. అందులో తన తండ్రికి ఎందుకు ఓటు వేయవద్దో కూడా చెప్పేస్తున్నారు.

బూడి ముత్యాలనాయుడికి ఓటు వేయవద్దంటూ కొడుకు రవి కుమార్ విడుదల చేసిన పోస్టర్లలో కొడుక్కి న్యాయం చేయలేనివాడు మీకేం చేస్తాడంటూ ఓటర్లను ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో ఓటర్లు ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మాడుగుల ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ డిప్యూటీ సీఎం కూడా అయిన బూడి ముత్యాల నాయుడిని ఈసారి జగన్ అక్కడ కాకుండా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని పంపారు. అక్కడితే ఆగకుండా ఆయన కుమార్తె ఈర్ల అనురాధను మాడుగులలో బరిలోకి దింపారు. దీంతో అక్కడ పోటీపై ఆశలు పెట్టుకున్న కొడుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications