జగన్ వస్తాడనుకోలేదు, తొక్కేయలేదు: ఆనం, అన్నం తినకున్నా ఇది సోకు
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జగన్ చేసే ప్రతి పని దుర్మార్గమైనదన్నారు. ధన వ్యామోహం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తారని ఎవరైనా ఊహించారా అన్నారు.
ఉనికి కోసం తాము తెలుగుదేశం పార్టీలో చేరలేదని చెప్పారు. తాము కొంపలు కొట్టే వాళ్లం కాదన్నారు. తాము రెడ్లం కాదని.. బీసీ రెడ్లమని చెప్పారు. తాము పదవుల కోసం కాదని, జనాల కోసం తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పారు.
జగన్‌కు నోటి దూల అని, అహంకారి అన్నారు. మేం మా తమ్ముళ్లను రాజకీయంగా తొక్కేయలేదని చెప్పారు. రాక్షసుడు, మూర్ఖుడు, ధనవ్యామోహం కలిగిన జగన్ రాజకీయాల్లోకి వస్తాడని ఎవరూ అనుకోలేదన్నారు. మా తమ్ముళ్లు మేం చెప్పింది వినలేదన్నారు. రాజకీయాలు వద్దంటే వినలేదన్నారు. నా తమ్ముళ్లంటే నాకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పారు.
నా తమ్ముళ్లను నేను ఎందుకు తొక్కేస్తానని, వాళ్లు కాకుండా ఎవరిని పైకి తీసుకు వస్తానని చెప్పారు. నా తమ్ముళ్లు మంచి వాళ్లేనని, వారిని తప్పుపట్టనని చెప్పారు. తనకు తన తమ్ముడు రామనారాయణ రెడ్డే లీడర్ అని చెప్పారు. ఎన్నికల్లో ఇక పోటీ చేయనని, రాజకీయాల్లో ఉంటానని చెప్పారు.
టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయని చెప్పారు. తాము బీసీ రెడ్లమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా తమ మాటే వింటారని చెప్పారు. జగన్ తమను బయట కూర్చోబెట్టి, డబ్బులున్నోళ్లను లోపల కూర్చోబెట్టారన్నారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని నాడు తాము సంతకాలు పెట్టామని, గొంతెత్తి అరిచిన వ్యక్తిని నేను అని చెప్పారు. కానీ అప్పుడు జగన్ గురించి తెలియకుండా అలా మాట్లాడామని చెప్పారు. అయితే, ఆయన సీఎం అయితే ఆ ఖర్మ మేం మోయవలసి వచ్చేదని, బతికిపోయానని చెప్పారు.

మంత్రి నారాయణతో తమకు ఎలాంటి సెటిల్మెంట్ కాలేదన్నారు. నారాయణ పైన మాకు ఎలాంటి కోపం లేదన్నారు. తాము బాగానే ఉన్నామని చెప్పారు. గతంలో చంద్రబాబుని తిట్టింది నిజమేనని, అదే సమయంలో తాము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అసెంబ్లీ ప్రాంగణంలో బాబుకు నమస్కరించేవాడినన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తామని, చంద్రబాబు కచ్చితంగా దానిని సాధిస్తారని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పదవులు ఉన్నా లేకున్నా జనం కోసం మేం పని చేస్తామన్నారు. జనం మా వెంటే ఉంటారని చెప్పారు.
జగన్ చేసే ప్రతి పని దుర్మార్గమైనదన్నారు. అసెంబ్లీలో జగన్ మరొకరిని మాట్లాడనివ్వడం లేదన్నారు. ఆయనే మాట్లాడుతున్నారన్నారు. జగన్ నమ్మిన వారిని మోసం చేశాడన్నారు.
ఆడి కార్లో తిరగడం, రెబాన్ కళ్లద్దాలు పెట్టడం మా షోకు అన్నారు. మేం అన్ని తిన్నా తినకపోయినా ఈ అద్దాలు, కారు ఉండాలన్నారు. ఇది మా షోకు అన్నారు. తనకు వీణ వాయించడం ఇష్టమని, కొద్దిగా నేర్చుకున్నానని, కచేరీలు ఇచ్చేంత రాదన్నారు. గిటార్, వయోలిన్ వాయిస్తానని చెప్పారు. చిరంజీవి 150వ సినిమాలో తనకు అవకాశం ఇవ్వమని అడగలేదన్నారు. చిరంజీవి కూడా తనను అడగలేదని, కానీ మంచిగా ఉంటామన్నారు.
జగన్ దీక్షపై సెటైర్లు
జగన్ జల దీక్ష పైన ఆనం విమర్శలు గుప్పించారు. ఒక్కనాడైనా వ్యవసాయం చేయని జగన్‌కు రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని, ఆయన కర్నూలులో చేస్తున్నది జల దీక్ష కాదని, జలగ దీక్షని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన తరువాత తొలిసారిగా పార్టీ అధికార కార్యాలయానికి వచ్చిన మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టుల నుంచి తన ఫ్యాక్టరీలకు నీటిని తీసుకు వెళుతున్న జగన్ ధర్నాల పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఓ వైపు ప్రజలు కన్నీరు పెడుతున్నారని చెప్పే ఆయన, ఎమ్మేల్యేల ఫిరాయింపులను చూసి స్వయంగా కన్నీరు కారుస్తున్న పరిస్థితి నెలకొందని, మరో ఆరు నెలల్లో వైసిపి పూర్తిగా ఖాళీ అయిపోయి, ప్రతిపక్ష హోదా కూడా పోతుందన్నారు.












Click it and Unblock the Notifications