ఆనంపై విమర్శలు: 'కాంగ్రెస్‌లో తుప్పుపట్టిన చెంచాలు, గరిటల్లాంటి నాయకులు'
నెల్లూరు: ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డిపై కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చేసిన విమర్శలపై ఆనం యువత, మాజీ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు స్పందించారు. ఆదివారం ఆనం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఖాళీ అయిన కాంగ్రెస్‌లో తుప్పుపట్టిన చెంచాలు, గరిటల్లాంటి నాయకులు ఉన్నారని వారికి ఏమి చేయాలో తోచక ఎదుటివారిపై విమర్శలకు దిగుతున్నారని ఆనం యువత నాయకులు, మాజీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ముజీర్ రోజ్‌థార్ విమర్శించారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజీవ్‌రతన్ ఢిల్లీలోని పెద్దల చేతులు పట్టుకొని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని, గత 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఆనం కుటుంబాన్ని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకుని మరణించిన రోహిత్ మృతిపై బస్సుయాత్ర చేపట్టి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. ఇందిరా భవన్‌లో వచ్చే చిల్లర డబ్బులతో బతుకుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆనం వివేకానందరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. ఆనం సోదరులపై చెడుగా మాట్లాడితే వేలాది మంది అభిమానులు సమాధానం చెప్తారన్నారు.
చివరగా కొమ్మి రాజేష్ మాట్లాడుతూ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో కనిపించని నాయకులు నేడు పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన ఆనం కుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు. పార్టీలో కనీసం నాయకుడిగా చెప్పుకోనివాళ్లంతా ఆనం కుటుంబాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications