అనంతపురంలో డీఆర్డీఓ ఆక్సిజన్ ప్లాంట్: స్టీల్ ప్లాంట్లల్లో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు
అనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో 11 మంది కరోనా పేషెంట్లు కన్నుమూయడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 19 వేల మందికి పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు ఒకేసారి సరఫరా చేయడానికి చాలినంత ప్రాణవాయువు అందుబాటులో ఉండట్లేదు. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకల కొరత వెంటాడుతోంది. ఫలితంగా- మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య డీఆర్డీఓ అనంతపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో యుద్ధ ప్రాతిపదికన దీన్ని నిర్మించబోతోంది. అనంతపురం లోక్‌సభ సభ్యుడు తలారి రంగయ్య, డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి మధ్య దీనిపై ఇప్పటికే సంప్రదింపులు ముగిశాయి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని సతీష్ రెడ్డి తెలిపారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తూముకుంట వద్ద గల వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట‌్ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచనున్నారు.

అవసరమైతే ఈ ప్లాంట్‌ను మరింత విస్తరించి, ఆక్సిజన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు చేపట్టింది. హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పలువురు అధికారులు ఈ ప్లాంట్‌ను సందర్శించారు. ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. తాడిపత్రి సమీపంలో ఉన్న అర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్లలోనూ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేశారు.
Recommended Video
క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ వ్యవస్థను జిల్లా అధికారులు మరింత పగడ్బందీ చేశారు. హిందూపురంలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో ఖాళీల కొరతను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో 20 పడకలను అదనంగా ఏర్పాటు చేసేలా, వాటిని కోవిడ్ పేషెంట్లకు మాత్రమే కేటాయించాలా చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గించడంపై జిల్లా వ్యాప్తంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తోన్నామని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అపోహలు వీడి నిర్భయంగా కోవిడ్ టీకాను వేయించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications