పవన్ ఆగ్రహం..! సస్పెన్షన్, విచారణకు చంద్రబాబు ఆదేశాలు..!
విజయవాడలో తాజాగా కృష్ణలంక పోలీసులపై సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ను లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని కాల్చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు కారణమైన కృష్ణలంక పీఎస్ సీఐ నాగరాజుని వీఆర్ కు పంపింది. అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై ఇలా లాకప్ లో జరిగిన హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇవాళ సీఎం చంద్రబాబు(Chandrababu)తో భేటీ అయ్యారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. అనంతరం సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

లాకప్ డెత్ కు కారణమైన సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం నిర్ణయించారు. సాయికృష్ణ ఘటనపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కూడా పాల్గొన్నారు.














Click it and Unblock the Notifications