ఎవరు అవునన్నా కాదన్నా.. నా పేరు అదే
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల.. తన రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగారు. తన పేరును మొరుసుపల్లి షర్మిల శాస్త్రిగా అభివర్ణిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గిడుగు రుద్రరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పల్లం రాజు, నర్రెడ్డి తులసీరెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు దీనికి హాజరయ్యారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా తన పేరు వైఎస్ షర్మిల రెడ్డేనని తేల్చి చెప్పారు. పులి కడుపున పులే పుడుతుందని, తాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తాన్నని అన్నారు. అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కానే కాదని వివరించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు తన అన్న జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు షర్మిల. వారిద్దరికీ ఆకాశం-భూమికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. జలయజ్ఞంపై వైఎస్ఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలిగారని చెప్పారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను 32 శాతం పూర్తి చేశారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులన్నింటినీ పక్కన పడేశారని విమర్శించారు. చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా పోలవరం ప్రాజెక్టు ముందుకు కదల లేదని ఆరోపించారు.
ప్రత్యేక హోదాపైనా చంద్రబాబు జగన్ ఒకే విధానంలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదని ధ్వజమెత్తారు. బీజేపీతో దోస్తీ కోసం వారిద్దరూ రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

హోదా గురించి రాగం తీసి, నిరాహార దీక్షలు చేసిన వాళ్లు ఇప్పుడు బీజేపీకి బానిసలుగా మారారంటూ విమర్శించారు. హోదా కాదు కదా... కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ వల్ల కాదని షర్మిల ధ్వజమెత్తారు.
రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీ బాగుపడుతుందని ఆమె తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌తోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications