కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్లకు రేటు ఫిక్స్ చేసిన షర్మిల
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక.. తెలుగుదేశం- జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరోవంక- ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి.

వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నుంచి జనంలో వెళ్లనున్నారు. సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. తొలి సభ విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఏర్పాటుకానుంది.
కాంగ్రెస్ ఎన్నికల రణరంగంలోకి దిగింది. పీసీసీ అధ్యక్షురాలిగా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన మొరుసుపల్లి షర్మిల.. పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సారథ్యం వహిస్తోన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఆమె పర్యటించనున్నారు. బస్సు యాత్రను నిర్వహిస్తోన్నారు.
షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పూర్వవైభవాన్ని సందరించుకుంటామని బలంగా నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుకుని ఎన్నికల ప్రచార కార్యక్రమాల వరకూ ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే అధికారం ఆమెకు అప్పగించింది.

ఈ నేపథ్యంలో- అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు.. కాంగ్రెస్ పార్టీకి విరాళాన్ని చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తెరపైకి వచ్చింది. డొనేట్ ఫర్ దేశ్ పేరుతో ఇదివరకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. విరాళాలను సేకరిస్తోంది.
ఇందులో భాగంగా- ఏపీలో కాంగ్రెస్ బీ-ఫారం తీసుకోదలిచిన అభ్యర్థులు అసెంబ్లీ- 10,000 రూపాయలు, లోక్‌సభ- 25,000 రూపాయలను విరాళంగా చెల్లించాల్సి ఉంటుందని షర్మిల తెలిపారు. ఈ మొత్తం పార్టీ ఖజానాకు చేరుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications