ఏపీలో ఆ పార్టీదే అధికారం పక్కా: పెన్షన్ల రచ్చ తరువాత ఏం జరిగింది?
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తో వస్తోన్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు సైతం వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
జన్‌మత్ సంస్థ.. మంగళవారం తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీకి 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి.. 46 నుంచి 48 స్థానాలకు పరిమితమౌతుందని జన్‌మత్ పేర్కొంది.
ఇప్పుడు తాజాగా ఆత్మ సాక్షి సంస్థ తన సర్వే వివరాలను విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన సర్వే ఇది. రాష్ట్రవ్యాప్తగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఈ నివేదికను వెల్లడించింది ఆత్మ సాక్షి సంస్థ.
ఈ నివేదిక కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 96 నుంచి 106 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి 63 నుంచి 69 సీట్లకు పరిమితమౌతుంది. మరో 16 నియోజకవర్గాల్లో వైసీపీ- టీడీపీ కూటమి మధ్య హోరాహోరి పోరు నెలకొంటుంది.

ఇందులో కూడా వైసీపీనే అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. 10 సీట్లు వైసీపీకి లభిస్తాయి. మిగిలిన ఆరింటిని టీడీపీ కూటమి సొంతం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తయ్యేసరికి వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం మరింత పెరుగుతుంది. మరో 20 సీట్లను అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఆత్మ సాక్షి సర్వే అంచనా వేసింది.
ఉమ్మడి జిల్లాలవారీగా చూసుకుంటే శ్రీకాకుళం- వైసీపీ 10, టీడీపీ 5, విజయనగరం- వైసీపీ 6, టీడీపీ 2, విశాఖపట్నం- వైసీపీ 7, టీడీపీ 7, తూర్పు గోదావరి- వైసీపీ 8, టీడీపీ 9, పశ్చిమ గోదావరి- వైసీపీ 7, టీడీపీ 7, కృష్ణా- వైసీపీ 8, టీడీపీ 6, గుంటూరు- వైసీపీ 8, టీడీపీ 7 స్థానాలను గెలుచుకుంటాయి.
ప్రకాశం- వైసీపీ 7, టీడీపీ 5, నెల్లూరు- వైసీపీ 4, టీడీపీ 4, కడప- వైసీపీ 8, టీడీపీ 1, కర్నూలు- వైసీపీ 10, టీడీపీ 3, అనంతపురం- వైసీపీ 9, టీడీపీ 4, చిత్తూరు- వైసీపీ 9, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంటాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది.
పెన్షన్ల రచ్చ చోటు చేసుకున్న తరువాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది. ప్రత్యేకించి- కొండ ప్రాంతాలు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రత వ్యతిరేకత ఏర్పడినట్లు ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పెన్షన్లను తెచ్చి ఇవ్వడాన్ని టీడీపీ అడ్డుకుందని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications