AP Polling: ఏపీలో ముగిసిన పోలింగ్- 5 గంటల వరకూ 68 శాతం..! గత రికార్డు బద్దలవుతుందా ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగతా 169 సీట్లలో 6 గంటలకు ముగిసింది.
అయితే ఈసీ వెలువరించిన గణాంకాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రంలో సగటున 68 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రం ఎంత ఆలస్యమైనా ఓటు హక్కు కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పోలింగ్ బూత్ లలో భారీ ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

ఈ లెక్కన చూస్తే సాయంత్రం 6 గంటలకే దాదాపు 80 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 79.4 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైతే రాజకీయ పార్టీల జయాపజయాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ తుది గణాంకాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో రీపోలింగ్ పై ఈసీ ఇచ్చే ఆదేశాలపైనా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications