ప్రజలకు చంద్రబాబు భారీ కానుక.. ఇకనుంచి రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. షరా మాములుగానే ఆయన పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే నెల 15వ తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించబోతున్నారు. దీన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తారు.
రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు
తాజాగా చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న బీమా పథకంపై కీలక ప్రకటన చేసింది. 2014-19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా ఇప్పుడు పరిహారాన్ని భారీగా పెంచింది. చంద్రన్న బీమా పరిహారం కింద గతంలో రూ.3 లక్షలు ఇచ్చేవారు. ప్రస్తుతం దీన్ని రూ.10 లక్షలకు పెంచారు. ప్రమాదవశాత్తూ మరణించినవారి కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ పథకాన్ని ప్రకటించారు.

లాయర్లు, విలేకర్లకు కూడా..
ప్రస్తుతం ఈ పరిధిలో ఉన్నవారితోపాటు త్వరలోనే న్యాయవాదులను, జర్నలిస్టులను కూడా తీసుకురాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్మికులు ఎవరైనా కేవలం రూ.15 చెల్లించి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తామని చెప్పారు. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు నెలనెలా మహిళలకు రూ.1500, ఉచిత గ్యాస్ సిలిండర్ తోపాటు డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాన్ని రూ.10 లక్షలకు, వ్యక్తిగత రుణాన్ని రూ.5 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి వందరోజుల్లో వీటిని అమలు చేయాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.












Click it and Unblock the Notifications