ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: డీఏ విడుదల, ఎప్పట్నుంచంటే?
అమరావతి: రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ తాజాగా సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు 7.73 శాతం డీఆర్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
2023 జూలై 1 నుంచి కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని తెలిపింది. డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చిలో చెల్లిస్తామని వెల్లడించింది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల డీఏ 22.75 శాతానికి చేరిందని ప్రభుత్వం పేర్కొంది.

జులై జీతంతో కలిపి డీఏను విడుదల చేయనున్న క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యుగల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష: అదనంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు
వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడ కూడా సిబ్బంది లేదనే మాట రాకూడదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల దాదాపుగా సమస్యలు సమసిపోతాయని సీఎం తెలిపారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని.. గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో రాష్ట్రం 23వ స్థానంలో ఉందన్నారు. ఇస్పత్రుల్లో చికిత్స పొందుతన్న వారి సంఖ్య ప్రస్తుతం 24 మంది అని తెలిపారు.
మరోవైపు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు వాటికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. కాగా, కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులపై సీఎం సమీక్షించారు. కొత్త మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో అదనంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనమని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని, ఈ ఐదు కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications