ఆ విషయంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం: మోదీకి లేఖ రాసినా..
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానానికి విరుద్ధంగా న్యాయ పోరాటానికి సిద్ధపడింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కనుంది. కేంద్రం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు, విధి విధానాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయనేది ఏపీ ప్రభుత్వ వాదన.
కృష్ణా జలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త విధివిధానాలను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది కూడా. ఏపీ, తెలంగాణకు మాత్రమే ఈ విధి విధానాలను పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలను పూర్తిగా మినహాయించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం వల్ల న్యాయపోరాటానికి దిగాలని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశంపై సోమవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
తన ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్- ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకీ లేఖ రాశారు. అందులో అన్ని విషయాలనూ పొందుపరిచారు. 1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం- కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ -1 (బచావత్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31వ తేదీన గెజిట్ చేసిందని పేర్కొన్నారు. కృష్ణానదిలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ట్రిబ్యునల్ లెక్క కట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, 2,130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఏపీకి స్వేఛ్చను కల్పించిందని పేర్కొన్నారు.

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం- 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, ట్రిబ్యునల్- 1 పంచిన ఈ వాటాలు సుప్రీంకోర్టు డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చాయనీ వివరించారు. దీని తరువాత- అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం- 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2వ తేదీన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏర్పాటైందని వైఎస్ జగన్ అన్నారు.
ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30వ తేదీన తన నివేదికను సమర్పించిందని, 75 శాతం డిపెండబిలిటీతో చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారించిందని వివరించారు. దీనితో పాటు కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం డిపెండబిలిటీతో అదనపు నీటిని కూడా కేటాయించిందని, దీని కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించిందని జగన్ చెప్పారు.
ఉమ్మడి ఏపీకి చేసిన మొత్తం కేటాయింపు 1,005 టీఎంసీలని పేర్కొన్నారు. అలాగే- 2,578 టీఎంసీల కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉందని అన్నారు. ఈ సమస్యను జల్‌శక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి రెండుసార్లు అంటే 2021 ఆగస్టు, 2022 మేలో తీసుకువచ్చానని జగన్ అన్నారు.
ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం రాకుండా చట్టపంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కృష్ణా నదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్లను దాఖలు చేశాయని గుర్తు చేశారు. అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications