రేషన్‌కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు
జూన్ నాలుగోతేదీన బాధ్యతలు స్వీకరించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాల్లో లోపాలను సరిచేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. కొద్ది సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, పంపిణీ చేసిన ప్యాకెట్లు కూడా గ్రాముల్లో తేడాలున్నాయని గుర్తించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పంచదార ప్యాకెట్ల తూకాల్లో తేడాలుండటంతో జులై, ఆగస్టు నెలల్లో పంచదార ప్యాకెట్ల పంపిణీని నిలిపివేశారు.
అక్టోబరు నుంచి గోధుమ పిండి, కందిపప్పు
ఆ రెండు నెలలు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుతం సరిగ్గా తూకం తూసి కేజీ పంచదార ప్యాకెట్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తయారుచేసి వినియోగదారులకు పంపిణీ చేయబోతున్నారు. ప్యాకెట్ రంగును మార్చి రేషన్ షాపులకు పంపిస్తున్నారు. వచ్చేనెలలో బియ్యంతోపాటు పంచదార కూడా ఇవ్వబోతున్నారు. రేషన్ కార్డుకు అరకేజీ ప్యాకెట్ పంచదార రూ.17కు ఇస్తారు. అక్టోబరు నెల నుంచి కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేస్తారు. అంత్యోదయ అన్నయోజన కార్డు ఉన్నవారికి అరకేజీ పంచదార రూ.13కే అందిస్తారు.

రాగులను కూడా కేటాయించారు
పౌరసరఫరాలశాఖ అధికారులు కొన్ని జిల్లాలకు రాగులను కేటాయించారు. రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గించి ఇస్తారు. మూడు కేజీల వరకు రాగులను రేషన్ లో ఉచితంగా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇకనుంచి రేషన్ ద్వారా పంపిణీ చేస్తే వస్తువుల్లో తూనికలు, కొలతల్లో ఎటువంటి తేడాలు రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కందిపప్పు, గోధుమపిండి, రాగులు, పంచదార, బియ్యం ఏపీ పౌసరసరఫరాలశాఖ ద్వారా ప్రజలకు పంపిణీ కాబోతున్నాయి. త్వరలోనే చిరుధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రేషన్ షాపులద్వారా పంపిణీ చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications