యుటిగా హైదరాబాద్: ఎపి ప్రభుత్వ అధికారిక నివేదిక
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదికను సమర్పించింది. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, కనీసం ఉమ్మడి రాజధానిగా ఉన్నం కాలమైనా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివోఎంకు నివేదిక పంపించినట్లు శనివారం వార్తలు వస్తున్నాయి. విభజన తర్వాత హైదరాబాద్‌లో వ్యవహారాలు సజావుగా సాగాలంటే ఇదొక్కటే మార్గమని అధికారిక నివేదికలో అభిప్రాయపడినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూ రెవెన్యూ, మునిసిపల్, ఉన్నత విద్య వంటి విభాగాలను గవర్నర్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ సైతం మంత్రుల బృందానికి సిఫారసు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆది ఆచరణ సాధ్యం కాదని అధికార యంత్రాంగం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని అధికారాలు గవర్నర్ చేతిలో, మరికొన్ని అధికారాలు తెలంగాణ రాష్ట్ర చేతిలో ఉంటే సమస్యలు ఎదురవుతాయని, సమన్వయం కుదరదని భావిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ పంపిన విజయ్ కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ సీనియర్ ఐపీఎస్‌లు, నిపుణులతో జరిపిన సమావేశంలోనూ హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై లోతైన చర్చ జరిగింది. "విభజన తర్వాత నక్సలిజం, ఉగ్రవాదం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.. శాంతి భద్రతలను గవర్నర్ చేతిలో పెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, కేంద్రం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడం తప్ప మరో మార్గం లేదని చెప్పినట్లు సమాచారం.
హైదరాబాద్‌పై కేంద్రం పూర్తిస్థాయి అజమాయిషీ ఉంటేనే నక్సల్స్, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా అదుపు చేయవచ్చునని, ఉభయ ప్రాంతీయుల హక్కులకు కూడా రక్షణ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. అయితే, తెలంగాణకే హైదరాబాదుపై పూర్తి స్థాయి అధికారాలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తోంది. టాస్క్‌ఫోర్స్ తీరును తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications