ఏపీలో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్...
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం (ఫిబ్రవరి 17) జరిగిన మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. చివరి గంటలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతించారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30గంటలకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదట వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 63,270 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
మూడో విడతలో మొత్తం 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా.. అందులో 57 9 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఈ స్థానాల్లో మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాల్లో మూడో విడత పోలింగ్ జరిగింది. ఇందులో 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఏపీలో మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలు నేడు జరగనుండగా... నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనుంది.