ఏపీకి పొంచివున్న ప్రమాదం.. ఈ జిల్లాలకు ముప్పు
ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు పొంచివుందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఈనెల 18వ తేదీ నాటికి అల్ప పీడనంగా మారుతుందని అంచనా వేస్తోంది. ఇది శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగనుంది. తుఫాన్‌గా మారే అవకాశాన్ని కొట్టివేయలేమని అధికారులు అంటున్నారు.
డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు కురుస్తాయని, ఒకవేళ ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారితే ఎటువైపు పయనిస్తుంది అన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే అధిక శాతం ఏపీవైపుగానే రావొచ్చంటున్నారు. దీంతో తీరప్రాంత ప్రజలు భయపడుతున్నారు. మిగ్ జాం తుఫాన్ బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో మరో తుఫాన్ హెచ్చరికతో వీరంతా వణికిపోతున్నారు. మరో 4రోజుల్లో తుఫాన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబాలకు చెందినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకటి రెండుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరు జల్లులకు అవకాశం ఉందంటున్నారు. మిగ్ జాం తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లోని పంటలు నీటమునిగి రైతులను నష్టాలపాలు చేశాయి. మరోసారి తుఫాను అని హెచ్చరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications