అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
బోస్టన్/గుంటూరు: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి అభిజిత్ (20) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గత సంవత్సరంలో బోస్టన్ యూనివర్సిటీలో చేరాడు. తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటికి సమీపంలోని ఓ కారులో మృతదేహాన్ని గుర్తించారు. కాగా, అభిజిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

అయితే, అభిజిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో చంపి అడవిలో కారులో వదిలేసినట్లుగా భావిస్తున్నారు. హత్యకు గల కారణం తెలియరాలేదన్నారు. డబ్బు లేదా ల్యాప్‌టాప్ కోసమో అభిజిత్ ను చంపేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
గుంటూరుకు చెందిన చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండేవాడు. మొదట విదేశాలకు పంపేందుకు ఇష్టపడని తల్లితదండ్రులు.. అభిషేక్ భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో అమెరికాకు పంపారు. ఇంజినీరింగ్ సీటు రావడంతో బోస్టన్ యూనివర్సిటీలో గత సంవత్సరం జాయిన్ అయ్యాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అభిజిత్ మరణవార్త ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని నింపింది. అభిజిత్ మృతదేహాన్ని అమెరికా నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు తరలించారు. కాగా, ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications