కృష్ణాజిల్లాలో పెను విషాదం: కృష్ణమ్మలో ముగ్గురు యువకులు గల్లంతు
విజయవాడ: కృష్ణాజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్తీక సోమవారం నాడు నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు జలసమాధి అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. దీనికోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్నారు. ముగ్గురు యువకులు 20 నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే కావడం స్థానికులను కలచి వేసింది. మృతుల కుటుంబాల్లో పెను విషాదాని మిగిల్చింది.
జిల్లాలోని పామర్రు నియోజకవర్గం తొట్లవల్లూరు వద్ద ఈ ఉదయం ఘటన సంభవించింది. మృతులను నరేంద్ర, నాగరాజు, పవన్‌గా గుర్తించారు. వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో 10 మంది యువకులు ఈ ఉదయం నదీస్నానానికి వెళ్లారు. కృష్ణానదీ పాయ తొట్లవల్లూరు మీదుగా ప్రవహిస్తుంటుంది. ఈ పాయ మళ్లీ వరదా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రధాన నదిలో కలుస్తుంది.

10 మంది యువకులు తొట్లవల్లూరు సమీపంలో ఈ పాయలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేస్తోన్న సమయంలో ముగ్గురు యువకులు ప్రవాహానికి కొట్టుకునిపోయారు. వారిని కాపాడటానికి వారి స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్థానిక మత్స్యకారులు కూడా వారిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మిగిలిన వారు హుటాహుటిన తొట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సహాయంలో గల్లంతైన ముగ్గురి కోసం గాలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరొకరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున కృష్ణానదీ తీరానికి చేరుకున్నారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.