నందమూరి ఫ్యామిలీకి మాజీ మంత్రి అనిల్ సూచన - బాలయ్య మర్చిపోవద్దు..!!
ఎన్టీఆర్ పేరు మార్పు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. సభలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు మార్పుకు కారణాలను వివరించారు. టీడీపీ ఈ వ్యవహారం పైన ఆందోళనలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామంటూ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నందమూరి వంశం ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఇక, హీరో- టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇదే వ్యవహారం పైన స్పందించారు. సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ పేరు మార్చటాన్ని తప్పుబట్టారు.

బాలయ్య లక్ష్యంగా మంత్రులు
ఎన్టీఆర్ తెలుగు జాతి వెన్నుముక అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ భిక్షతో ఇప్పుడు అక్కడ ఉన్నవారు విశ్వాసం లేని వారని వ్యాఖ్యానించారు. బాలయ్య కామెంట్స్ పైన మంత్రులు వరుసగా స్పందించారు. బాలయ్య పైన విరుచుకు పడ్డారు. చంద్రబాబు మీ తండ్రిని దూరం చేసినందుకు పగ తీర్చుకో బాలయ్య అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొందరు మంత్రులు వైశ్రాయ్ ఘటన గుర్తు చేసారు. నాడు తండ్రికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబుకు బాలయ్య మద్దతుగా నిలిచారంటూ ఫైర్ అయ్యారు.

నందమూరి కుటుంబం పోరాటం చేయాలి
ఇక, ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. ఈ పేరు మార్పు వ్యవహారం పైన నందమూరి కుటుంబం స్పందించటం పైన ఆయన కీల వ్యాఖ్యలు చేసారు. నందమూరి వంశం పోరాడాల్సింది పేరు మార్పు పైన కాదని పేర్కొన్నారు. వారంతా కలిసి చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీని స్వాధీనం చేసుకోవటం గురించి పోరాటం చేయాలంటూ సూచించారు. అదే సమయంలో బాలయ్య ప్రభుత్వం పైన చేసిన విమర్శల పైనా స్పందించారు.

బాలయ్య ఇంట్లో కాల్పుల అంశంపై
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు. నాడు చంద్రబాబు బాలయ్యను పరామర్శించటానికి పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు. ఆ కేసు నుంచి బాలకృష్ణ బయట పడ్డారంటే వైఎస్సార్ పుణ్యమేనని వ్యాఖ్యానించారు. బాలయ్య ఈ విషయం మర్చిపోకూడదనని అనిల్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పైన గౌరవంతోనే జిల్లాకు ఆయన పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications