జగనన్నా! రోజాను దారిలో పెట్టు: అనిత, 'ఆమె లేకుంటే మాట్లాడడేమో'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పైన టిడిపి ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పీతల సుజాతలు శుక్రవారం ఉదయం నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా అనిత వైసిపి అధినేత జగన్‌కు సూచన చేశారు. రోజాను దారిలో పెట్టాలని లేదంటే ప్రతిపక్ష హోదాను కోల్పోతారని జగన్‌ను హెచ్చరించారు.
ఓ చెల్లిగా అడుగుతున్నానని, జగనన్నా అన్యాయం ఎవరికి జరిగిందని ప్రశ్నించారు. రోజాకు అన్యాయం జరిగిందా, తనకు అన్యాయం జరిగిందా చెప్పాలన్నారు. నాకు జరిగిన అన్యాయంపై జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రోజాను వెంటనే మీ పార్టీ నుంచి తప్పించాలని హితవు పలికారు.

లేదంటే ఆమె నోటిని అదుపులో పెట్టాలన్నారు. ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, రోజాలాంటి వారిని మీ పక్కనే మరింతకాలం ఉంచుకుంటే ఆ స్థానం కూడా దక్కదని హెచ్చరించారు. ఓ చెల్లిగా ఈ మాట చెబుతున్నానని చెప్పారు.
హైకోర్టు ఉత్తర్వుల్లో కేవలం సెక్షన్ తప్పుగా ఉందని మాత్రమే పేర్కొన్నారని చెప్పారు. అసభ్య హావభావాలను ప్రదర్శిస్తూ, సాటి మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఆమెను వెనకేసుకు రావడం ఎంత మాత్రం సమంజసమని జగన్‌ను, వైసిపిని అనిత ప్రశ్నించారు. సస్పెన్షన్ పైన హైకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని, సలహా మాత్రమే అన్నారు. కోర్టు ఉత్తర్వులపై సభాపతి నిర్ణయం వచ్చే వరకు చూడకుండా రాద్దాంతం చేస్తున్నారన్నారు.
మంత్రి పీతల సుజాత మాట్లాడాతూ... సభా నాయకుడు చంద్రబాబుతో పాటు సభాధ్యక్ష స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాకు ఎంతటి శిక్ష వేసినా తక్కువేనని ధ్వజమెత్తారు. అయినా ఒక్క సభ్యురాలి కోసం సమావేశాలకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలంతా బయటే ఉండిపోవడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా జగన్ పైన పీతల సుజాత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో రోజా లేకుంటే జగన్ మాట్లాడలేరేమోనని ఎద్దేవా చేశారు. రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. రోజా మాట్లాడిన మాటలు ఏ దళిత వ్యక్తి మరిచిపోరన్నారు.












Click it and Unblock the Notifications