తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 74,149 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న పండగ ఇది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి- ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఈ ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు.
ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఈ సందర్భంగా తిరుమల పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండిపల్లెంలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి 'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు పెద్ద జీయ్యర్ స్వామి, చిన్న జీయ్యర్ స్వామి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని అందజేస్తారు.
హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
ఆణివార ఆస్థానం కారణంగా నేడు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications