జగన్ సర్కార్ కు తుఫానుల గండం: ఏపీ ప్రభుత్వంపై ఆర్ధిక భారం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్లు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఏపీకి వరుస తుఫానులు రానుండటం మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది. మొన్నటికి మొన్న మిచౌంగ్ తుఫాను కలిగించిన దారుణ నష్టాల నుండి, కలిగిన కష్టాల నుండి ఇంకా బయట పడక ముందే మరో గండం తుఫాను రూపంలో ఏపీపై ప్రభావం చూపనుంది.
డిసెంబర్ నెల 16వ తేదీన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 18వ తేదీకి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వైపుగా కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో తిరుపతి, బాపట్లలో పర్యటించి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పంట నష్టం పరిశీలించారు.
రైతులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధితులతో మాట్లాడి సహాయం అందిస్తామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవడం లేదని, వారికి సాయం అందడం లేదని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.
ఒక పక్క సీఎం జగన్ మిచౌంగ్ తుఫాన్ బాధితులకు సహాయం అందించే పనిలో బిజీగా ఉంటే, ఇదే సమయంలో మరో తుఫాను ఏపీ ఆర్థిక పరిస్థితి పై మరింత ప్రభావం చూపనుంది. మూలిగే నక్క మీదతాటికాయ పడ్డట్టు మళ్లీ తుఫాను ప్రమాదం పొంచి ఉండడం సీఎం జగన్మోహన్ రెడ్డి సామర్థ్యానికి పరీక్షగా మారింది. తుఫాన్ల కారణంగా ప్రజలను కాపాడేందుకు ఆర్ధిక వనరులు ఎక్కువ అవసరం అవుతున్నాయి.
దీంతో ఏపీ సర్కార్ పై ఆర్ధిక భారం మరింత పెరిగింది. వరుస తుపానులతో విలవిలలాడుతున్న ఏపీని ఈ క్రమంలో సీఎం జగన్ ఏ విధంగా కాపాడుకుంటారు? ప్రజలలో భరోసా నింపేందుకు ఆయన ఏం చేస్తారు? ప్రతిపక్షాల దాడిని ఏ విధంగా? ఈ ప్రకృతి విపత్తులను ఏ మేరకు సమర్థవంతంగా ఎదుర్కొంటారు? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications