ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మరో ఆఫర్-నెలాఖరులోపు కడితే..!
ఏపీలో ఆస్తిపన్ను వసూళ్లు పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకూ బకాయి ఉన్న ఆస్తిపన్ను చెల్లిస్తే వడ్డీపై 50 శాతం మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టుకుంది. అంతే కాదు ఆస్తిపన్ను బకాయిదారులకు సచివాలయాల సిబ్బందితో బ్యాంకుల తరహాలో ఫోన్ కాల్స్ చేయించి మరీ వసూళ్లు చేసింది. ఇప్పుడు కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి అంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఈ నెలాఖరులోపు చెల్లించాలనుకునే వారికి అందులో 5 శాతం మొత్తాన్ని రాయితీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న జీవో కూడా జారీ చేసింది. ఇందులో ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ఏడాది ఆస్తిపన్ను చెల్లించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఇది వర్తిస్తుంది.

2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి పూర్తి పన్ను ఈ నెల 30 లోపు చెల్లిస్తే 5% రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఆస్తిపన్ను డిమాండ్ నోటీసులు ఆన్ లైన్లో ఇంకా విడుదల కాలేదు. రేపు వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఆన్ లైన్లో ఆస్తిపన్ను నోటీసులు విడుదల అయ్యాక ఈఆర్పీ ద్వారా పన్ను చెల్లింపు ఆప్షన్ వస్తుందని అందుకు ఈ నెల 6వ తారీకు వరకూ వేచి చూడాలని మున్సిపల్ శాఖ సూచించింది. దీంతో ఈ నెలాఖరులో ఆస్తిపన్ను చెల్లించడం ద్వారా ఆన్ లైన్లో అప్పటికప్పుడు ఈ 5 శాతం డిస్కౌంట్ పొందాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ కానుంది.












Click it and Unblock the Notifications