ఏపీ పోల్ అజెండాలోకి కొత్త అంశం ? సుప్రీంలో వైసీపీ సర్కార్ అఫిడవిట్ తో- బీఆర్ఎస్ ఎంట్రీ వేళ ?
ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల అజెండా ఎలా ఉండబోతోందన్న దానిపై ఇప్పటికే రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సంక్షేమంపైనే ఎన్నికలకు వెళ్లాలని భావించిన వైసీపీకి మూడు రాజధానుల అంశం చికాకు పుట్టిస్తోంది. దీంతో మూడు రాజధానుల్ని, సంక్షేమాన్ని కలిపి ఎన్నికల అజెండాగా సిద్ధం చేసుకుంటోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఓ కేసుకు సంబంధించి చెప్పిన అభిప్రాయం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అజెండాలోకి చేరబోతోంది.

ఏపీ ఎన్నికల అజెండా
ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో సంక్షేమం, మూడు రాజధానుల అజెండాతో వెళ్లేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతుండగా.. టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కూడా అమరావతినీ, అభివృద్ధి లేమినీ ప్రధానాస్త్రాలుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో 2024లో ఎవరి వాదన అసలు అజెండాగా మారబోతోందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. గతంతో పోలిస్తే మారుతున్న రాజకీయ సమీకరణాలు, రాజధాని సమస్య ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్దితులు, ఎన్నికల అజెండాలో చేరుతున్న కొత్త అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నాయి.

ఎన్నికల అజెండాలోకి విభజన ?
ఇప్పటికే 2024 ఎన్నికల అజెండాను దాదాపుగా సిద్ధం చేసుకున్న అధికార విపక్షాలకు తాజాగా ఏపీ విభజన అంశం తలనొప్పిగా మారుతోంది. ఎప్పుడో విభజన పూర్తయిన తర్వాత దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా విచారణకు స్వీకరించడంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఇది సమస్యగా మారింది. విభజనపై ఇప్పుడు చర్చ అవసరం లేదంటూ సుప్రీంకోర్టుకు వైసీపీ సర్కార్ చెప్పడం మొత్తం సమస్యకు మూలకారణమైంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి విభజన గురించి అక్కర్లేదా అంటూ ఉండవల్లి వేసిన ప్రశ్నతో రాజకీయం రగులుకుంది. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వైసీపీ నేత సజ్జల.. తమది సమైక్యవాదమేనని, తిరిగి రెండు రాష్ట్రాలు కలిసే పరిస్దితి వస్తే దానికే మద్దతిస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణతో పాటు ఏపీలోని టీడీపీ వంటి పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.

బీఆర్ఎస్ ఎంట్రీ వేళ ?
అసలే ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు తాజాగా జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ముందుగా కర్నాటక ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. వీలు చూసుకుని ఏపీలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. అసలే విభజనకు కారణమైన పార్టీ కావడం, ఏపీలో ఎలాంటి వాదన వినిపిస్తుందో తెలియని పరిస్దితుల్లో ఇప్పుడు విభజన అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుండటం కొత్త సమస్యలకు కారణమయ్యేలా ఉంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి వైసీపీ కూడా విభజన గురించి వదిలేయమని వాదిస్తే అప్పుడు పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలియదు. అసలే విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ప్రజలు పూర్తిగా మూలన కూర్చోబెట్టారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ, టీఆర్ఎస్ ల వాదన ఎవరికి మేలు చేయబోతోందన్నది కూడా చూడాల్సి ఉంది.

2024 ఎన్నికల అజెండాలో చేరితే ?
2024 ఎన్నికలకు ఏపీకి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి, రాజధానులు, జగన్ పాలన వంటి అంశాలు ఇప్పటివరకూ అజెండాగా ఉన్నాయి. ఇప్పుడు విభజన అంశం కూడా ఇందులో చేరితో అప్పుడు పరిస్ధితులు ఎలా మారతాయన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే విభజనకు మద్దతుగా సుప్రీంకోర్టులో వైసీపీ ఇచ్చిన అఫిడవిట్ ను ఆధారంగా చేసుకుని విపక్షాలు జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెడితే ఈ అంశం కూడా ఎన్నికల అజెండాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓవైపు రాజధానుల్ని విడగొడుతూ, మరోవైపు సమైక్యవాది అని ఎలా చెప్పుకుంటారంటూ సీపీఐ నారాయణ జగన్ కు వేస్తున్న ప్రశ్నలు భవిష్యత్ రాజకీయానికి సంకేతంలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications