అనంత సభ తర్వాత.. ఇంజనీరింగ్ విద్యార్థులతో పవన్ మీటింగ్!
అనంతపురం : తిరుపతి కాకినాడ సభల తర్వాత ఇప్పుడు అనంతలో మూడో సభకు సిద్దమైపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదాపై గళమెత్తేందుకు ఆయన ఈ సభను నిర్వహిస్తుండడంతో.. గతంలో లాగే సన్నాయి నొక్కులు నొక్కుతారా? లేక ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
పవన్ పొలిటికల్ అడుగుల పట్ల బీజేపీ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తోంది. దీంతో భవిష్యత్తులో పవన్ బీజేపీ నడుమ దాదాపు సంబంధాలు లేనట్టే అని జనం భావిస్తున్నారు. కాబట్టి గతంలో లాగా బీజేపీని సుతిమెత్తగా కాకుండా గట్టిగానే నిలదీసేందుకు ప్రయత్నిస్తారా? అన్నది చూడాలి. అలాగే టీడీపీ పట్ల ఆయన తన గత వైఖరినే అవలంభిస్తారా? లేక చంద్రబాబును సైతం ఈసారి టార్గెట్ చేస్తారా? అన్నది జనంలో వ్యక్తమవుతోన్న ప్రశ్న.

ఇక కాకినాడ సభలో నిర్వహించినప్పటికీ.. పూర్తి స్పష్టత లేకుండా ప్రసంగమంతా గందరగోళంతో నింపేశారు పవన్. అదే సభలో ఓ అభిమాని దుర్మరణంతో ఇకనుంచి సభలు ఉండవని ప్రకటించేశారు కూడా. హోదాపై నేతలు విఫలమైనప్పుడు రంగంలోకి దిగుతానన్న పవన్.. వేచి చూసే ధోరణిని పక్కనబెట్టి ప్రస్తుతం ఆయనే రంగంలోకి దిగుతున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష అధినేత జగన్ కూడా గట్టిగానే పోరాడుతున్నందునా..! జగన్ పట్ల పవన్ అభిప్రాయం ఏంటనేది ఈ సభ ద్వారా తేట తెల్లం కానుంది.
సభ మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ కాలేజీలో మీటింగ్ కూడా:
నవంబర్ 10న అనంతపురం జూనియర్ కాలేజీలో సభ అనంతరం గుత్తిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ ముచ్చటించబోతున్నారనేది ప్రస్తుతం తెరపైకి వచ్చిన వార్త. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనేది జనసేన నుంచి లేకపోయినప్పటికీ.. ఇంజనీరింగ్ కళాశాల అధినేత సుధీర్ రెడ్డి స్పందిస్తూ దీనిని ధ్రువీకరించారు.
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ కార్యక్రమం నిజమేనని చెప్పిన సుధీర్ రెడ్డి.. అయితే ఆ సభకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. అనంతలో కరువుకు గురించి పవన్ కు వివరించిన సందర్బంలో.. ఓసారి తమ కాలేజీకి రావాల్సిందిగా ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించిన పవన్ గుత్తిలోని ఇంజనీరింగ్ కాలేజీకి వస్తున్నారని సుధీర్ రెడ్డి తెలిపారు.
జగన్ యువభేరీలను ధీటుగా ఎదుర్కోవడానికేమైనా ప్లాన్ చేస్తున్నారా!
ప్రస్తుతం ప్రత్యేక హోదాపై గట్టిగా గొంతెత్తున్న వైసీపీ అధినేత జగన్.. హోదా అవసరాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు, ముఖ్యంగా ఈ విషయంలో యువతను చైతన్యపరిచేందుకు యువభేరీలను ఓ అస్త్రంగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. వారి ద్వారా ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
పరిస్థితి చూస్తుంటే.. జగన్ యువభేరీలను ధీటుగా ఎదుర్కొని తాను కూడా అదే పంథాలో నడవడానికా అన్నట్టు పవన్ కూడా కాలేజీ మీటింగ్స్ ను ప్లాన్ చేయడం ఒకింత ఆసక్తికర చర్చకు తావిస్తోంది. గుత్తి ఇంజనీరింగ్ కాలేజీలో పవన్ మీటింగ్ కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో యువతకు చేరువయ్యేందుకు ఆయన ఈ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు పలువురు.












Click it and Unblock the Notifications