సీజేఐ ఎన్వీ రమణకు నేడు మరో హోదా : ఎన్నో ప్రత్యేకతలు - ఆ జాబితాలో..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మరో హోదా దక్కనుంది. సీజేఐ గా అవకాశం దక్కించకున్న ఎన్వీ రమణ..ఇప్పుడు కొత్త పురస్కారం అందుకోబోతున్నారు. ఈ నెల 26న సీజేఐ హోదా నుంచి ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన వారసుడి పేరు ఖరారు అయింది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీజేఐ ఎన్వీ రమణకు తెలుగు గడ్డ పైనే మరో పురస్కార ప్రధానం చేసేందుకు రంగం సిద్దమైంది. దీంతో ఇప్పటి వరకు జస్టిస్ ఎన్వీ రమణగా ఉన్న ఆయన పేరు ముందు డాక్టర్ హోదా చేరనుంది.


సీజేఐకు గౌరవ డాక్టరేట్
ఇక నుంచి ఆయన డాక్టర్ ఎన్వీ రమణ కాబోతున్నారు. ఇందులోనూ పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 105 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ రోజున యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.గవర్నర్ తమిళసై యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఈ పురస్కారం ప్రధానం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇదే తొలి డాక్టరేట్ కావటంతో ఈ సారి ప్రత్యేకత. అది సీజేఐ అందుకోబోతున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టుకు 48వ చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి అందిస్తున్న 48వ డాక్టరేట్ కావటం మరో ప్రత్యేకత.

48వ సీజేఐ - 48వ డాక్టరేట్
ఈ స్నాతకోత్సవం వేళ ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఈ విశ్వ విద్యాలయంలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించారు. కానీ, ఇప్పటి వరకు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసారు. 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్‌కు ఇచ్చింది. ఉస్మానియా నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న వారిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్‌సింగ్ వంటి వారున్నారు. ఇప్పుడు తెలుగు వ్యక్తిగా.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ ఈ డాక్టరేట్ అందుకోనున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక తొలి డాక్టరేట్
ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్‌నేత్రావలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు లా విభాగంలో 29, సాహిత్యంలో 12, సైన్స్‌లో 6 గౌరవ డాక్టరేట్‌ల ను ఓయూ ప్రదానం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. గౌరవ డాక్టరేట్ ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ అందుకున్న హోదాల్లో మరో హోదా జత కానుంది.