మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్.. మరో 13 శాతం షాపుల కోత.. 566 దుకాణాల మూత...
ఏపీలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మద్యం విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించిన రోజే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం... 24 గంటల్లోనే మరో 50 శాతం ధరలను పెంచుతూ భారీ షాక్ ఇచ్చింది. అంటే మొత్తం ధర 75 శాతం పెంచేసింది. మద్య నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటించినా మందుబాబుల హంగామా ఏమాత్రం తగ్గకపోవడంతో విపక్షాలు విమర్శలకు దిగాయి. దీంతో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం షాపులను గతేడాది అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. 20 శాతం దుకాణాలు మూసేసింది. తాజాగా లాక్ డౌన్ తర్వాత పరిస్ధితుల నేపథ్యంలో మరో 13 శాతం షాపులను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటివరకూ మొత్తం 33 శాతం షాపుల మూసివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు. వాస్తవానికి ప్రభుత్వం ఏడాదికి 20 శాతం షాపుల చొప్పున తగ్గిస్తూ ఐదేళ్లలో మద్య నిషేధాన్ని సంపూర్ణం చేయాలని భావించినా తాజాగా లాక్ డౌన్ తర్వాత మందుబాబుల హంగామా, విపక్షాల విమర్శల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య 2934కి తగ్గిపోనుంది. గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి 4380గా ఉన్న మద్యం షాపులను 20 శాతం కోతతో 3500కి పరిమితం చేసిన ప్రభుత్వం... తాజాగా మరో 13 శాతం తగ్గించడంతో వాటి సంఖ్య మరింత తగ్గినట్లయింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే 43 వేల బెల్టు షాపులను తొలగించిన ప్రభుత్వం... 40 శాతం మేర బార్లను కూడా ఉపసంహరించుకుంది.












Click it and Unblock the Notifications