రుషికొండపై మరో ట్విస్ట్ ? జగన్ షిఫ్టింగ్ వేళ విచారణకు కేంద్ర బృందం..!
వైసీపీ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నానికి ముందుగానే తరలివెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో ట్విస్టులు తప్పడం లేదు. ముఖ్యంగా వైజాగ్ లో జగన్ క్యాంపు కార్యాలయం ఉంటుందని భావిస్తున్న రుషికొండపై అక్రమ కట్టడాల విషయంలో ఇవాళ మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో జరుగుతున్న విచారణలో కేంద్ర బృందం కీలక సమాచారం ఇచ్చింది.
వైజాగ్ రుషికొండపై గతంలో అనుమతించిన పరిమితికి మించి భవనాలు నిర్మించిన వ్యవహారంలో హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. దీనికి హాజరైన కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు.. డిసెంబర్ మొదటివారంలో రుషికొండ పరిశీలనకు కేంద్ర బృందం వెళ్తుందని తెలిపారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర బృందం రుషికొండకు వెళ్లి అక్రమాలను పరిశీలించనుంది. దీని ఆధారంగా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ విశాఖకు డిసెంబర్ మొదటివారంలో వస్తారని ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పుడు రుషికొండపై కట్టడాల పరిశీలనకు కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో జగన్ అక్కడికి మారతారా లేక తన షిఫ్టింగ్ ను మరోసారి వాయిదా వేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్రమ కట్టడాల పరిధిలోకి వచ్చే భవనంలోకి జగన్ మారితే కేంద్ర బృందం విచారణ సందర్భంగా సమస్యలు తప్పవు.
దీంతో హైకోర్టుకు కేంద్రం చెప్పిన విధంగా డిసెంబర్ మొదటివారంలో కేంద్ర బృందం రుషికొండను పరిశీలించి వెళ్లిపోయాక జగన్ అక్కడికి తరలివెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా ముందుగా వెళ్లాలని భావిస్తే మాత్రం ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రుషికొండ కట్టడాలపై కేంద్ర బృందం పరిశీలన, నివేదిక వచ్చాక డిసెంబర్ 27న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications