మాజీలు సహా దేనికైనా రెడీ, కిరణ్ రెడ్డి కూడా: పితాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పైన ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదని, చివరలో కిరణ్ ప్రసంగం మూడు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఉంటుందని, రాష్ట్ర సమైక్యత కోసం తాము మాజీలు కావడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పితాని సత్యనారాయణ శనివారం అన్నారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని కానీ, ఆ విషయమై ఎలాంటి సమాచారం మాత్రం లేదన్నారు.
పదవులు పట్టుకుని తాము వేలాడటం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి ఏ సమయంలోనైనా రాజీనామా చేసి మాజీలు కావటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన నాలో కానీ, మాలో కానీ లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు మాత్రం కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణ విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరగాలని తాను మొదటి నుంచీ కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం వస్తుందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మరో 60 రోజులు చర్చకు కావాలని కోరారు.
పిటిఐ వార్తా కథనాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని, తప్పకుండా అసెంబ్లీలో చర్చకు గడువు పెంచుతారని అభిప్రాయపడ్డారు. బిల్లుపై సమయం కావాలని రాష్ట్రపతిని కోరడం వల్ల ఏదో అయిపోతుందని అనుకోవడం పొరపాటు అన్నారు. కొత్త పార్టీ వచ్చినా రావొచ్చని మాత్రం ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications