ఏపీలో మరో సమ్మె నోటీసు- 23 నుంచి ఆ ఉద్యోగులూ రోడ్లపైకి..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యోగులు, కార్మిక వర్గాల సమ్మెలు కూడా పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాగైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే అంగన్ వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియచేస్తుండగా.. ఇప్పుడు వీరితో పాటు మరో ఉద్యోగులు కూడా జత కలవబోతున్నారు.

ఏపీలో ఇప్పటికే పలు కార్మిక సంఘాలు సమ్మెలు కొనసాగిస్తుండగా.. ఇప్పుడు అందులో మరికొన్ని కేటగిరీల ఉద్యోగులు కూడా చేరుతున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 104, 108 అత్యవసర సర్వీసుల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు జనవరి 23వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఆ లోపు ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 22లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే 23వ తేదీన సమ్మెలోకి వెళ్లనున్నట్లు 104, 108 సర్వీసుల ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వానికి సమర్పించిన సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు తమ సమ్మె నోటీసుల్ని వారు అందజేశారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ నోటీసులు ఇచ్చినట్లు వారు చెబుతున్నారు.
ఇవాళ సమ్మె నోటీసు ఇచ్చిన 104, 108 ఉద్యోగులు 22 వ తేదీ వరకూ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టినా అప్పటి వరకూ నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే 22వ తేదీ లోగా సమస్యలు పరిష్కారం కాకుంటే మాత్రం 23న తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్తామంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications