త్వరలో సంచలనాలు ? వైసీపీ నేతలకు ఢిల్లీ పిలుపులపై బీజేపీ ఛీఫ్..!
ఏపీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి వరుసగా పిలుపులు వచ్చాయి. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో డబ్బులు చేతులు మారడంతో పాటు మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ.. ఈ మేరకు కీలక నేతల్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైసీపీ తాజా, మాజీ నేతలకు పిలుపులు వచ్చినట్లు సమాచారం.
ఇదే అంశంపై ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. మద్యం స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో ఏపీలో త్వరలో సంచలనాలు జరగబోతున్నాయని మాధవ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలు జరిగాయని, ఇప్పుడు వాటి అన్నింటిపై దర్యాప్తు సాగుతోందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ మాధవ్ హెచ్చరికలు కూడా చేశారు. తద్వారా ఈ నోటీసులతో వ్యవహారం ఆగదని ఆయన తేల్చేశారు.

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర సీఐడీ విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించడంతో పాటు నిందితులుగా కూడా చేర్చింది. దీంతో ఈడీ కూడా తమ దర్యాప్తులో భాగంగా వీరిని ప్రశ్నించి అనంతరం అభియోగాలు నమోదు చేయబోతోంది. అదే జరిగితే మద్యం స్కాంలో మరికొన్ని పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ కోరుకున్నట్లు మద్యం స్కాంపై ఈడీ దర్యాప్తు చురుగ్గా సాగితే రాష్ట్రంలోనూ కీలక నేతల్ని అరెస్టు చేయొచ్చని భావిస్తోంది.












Click it and Unblock the Notifications