రాష్ట్ర విభజనా చెల్లదు: దేవినేని కొత్త వాదన, జగన్ సిగ్గులేకుండా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సెక్షన్ 8 విషయంలో మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. సెక్షన్ 8 కంటితుడుపు చర్యగా తెచ్చినదని, అది చెల్లదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి.
దీనికి దేవినేని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సెక్షన్ 8 చెల్లదంటే రాష్ట్ర విభజన కూడా చెల్లదన్నారు. ఉమ్మడి రాజధానిలో ప్రజల రక్షణ గవర్నర్‌దే అన్నారు. విభజన చట్టాన్ని సిద్ధం చేసింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని చెప్పారు.
సెక్షన్ 8 చెల్లకుంటే ఏపీ విభజన చట్టం -2014 ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉంటాయని చెప్పారు. విభజన చట్టంలో అన్ని అంశాలను ప్రస్తావించారని చెప్పారు. సెక్షన్ 8 కంటితుడుపు చర్య అని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు.

సిగ్గులేకుండా కేసీఆర్‌కు జగన్ మద్దతు
కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, వైయస్ జగన్ కుమ్మక్కై రాష్ట్ర విభజన చేశారని దేవినేని ఆరోపించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో జగన్ సూత్రధారి అని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను మంటకలుపుతుంటే జగన్ మాట్లాడటం లేదన్నారు. ఇంకా సిగ్గులేకుండా కేసీఆర్‌కు మద్దతిచ్చారన్నారు.
విభజన చట్టం చేసిందెవరు?, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
విభజన చట్టం పైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని దేవినేని నిలదీశారు. ఆ చట్టాన్ని చేసిందెవరని ప్రశ్నించారు. చంద్రబాబు పైన కుట్ర కోణంలో కేసు పెడితే గొంతు చించుకుంటున్న కాంగ్రెస్, వైసీపీ నేతలు తమ పైన ఉన్న కేసుల గురించి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లలో పందికొక్కుల్లా మెక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జగన్, కేసీఆర్‌తో కుమ్మక్కై విభజన చేశారన్నారు. కనీసం వార్డు మెంబర్లుగా గెలవలేకున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు.
పదేళ్లలో తిన్న డబ్బులు కాంగ్రెస్ పార్టీ కక్కాలన్నారు. మద్యం కేసులో బొత్స ఇరుక్కున్న విషయాన్ని గుర్తు చేశారు. మద్యం కేసు పైన విచారణ జరిపిస్తామన్నారు. సెక్షన్ 8 చెల్లదని కేసీఆర్ చెప్పడం సరికాదని, కాంగ్రెస్ దీనిపై స్పందించాలన్నారు.
రఘువీరా రెడ్డి పైన మేఘమథనం కేసు ఉందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. బొత్స, రఘువీరా వంటి నేతలు తమ పైన కేసులు పెట్టుకొని, నీతులు చెప్పడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications