త్వరలో మూడు రాజధానులు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు: కొత్త జిల్లాలతో పాటు
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన దూకుడును పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయాత్తమౌతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్.. ఇక కార్యాచరణలోకి దిగనున్నారు.

కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సాంకేతికపరంగా ఎలాంటి అడ్డంకులు కలిగించని విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని, వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.. ఇటీవలే రాజ్యసభలోనూ స్పష్టం చేసిన నేపథ్యంలో- ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త జిల్లాలతో పాటు..
వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులను సంబంధించిన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలనే పట్టుదలతో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా.. మూడు రాజధానుల్లోనూ ఒకేసారి పరిపాలనను ఆరంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి మనుగడలోకి రానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది. ఇంకా సమయం ఉన్నందున- ఈ లోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై దృష్టి సారించారని అంటున్నారు.

మార్చి 4న
మార్చి 4వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదని, ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోందని అంటున్నారు. దీనితోపాటు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపైనా కసరత్తు పూర్తయిందని సమాచారం.

సూపర్ కేపిటల్..
హైదరాబాద్ వంటి సూపర్ కేపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి నోచుకోవనే బలమైన అభిప్రాయం వైఎస్ జగన్‌లో ఉందని, మొదటి నుంచీ ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. సూపర్ కేపిటల్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం అనేది చారిత్రక తప్పిదానికి కారణమౌతుందని ముఖ్యమంత్రి ఇదివరకు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మరింత మెరుగైన బిల్లును తెస్తామంటూ..
వికేంద్రీకరణే సరైన విధానమని తాము బలంగా విశ్వసిస్తున్నామని, అన్నిప్రాంతాలు, అన్నికులాలు, అన్ని మతాలు సమానంగా పురోగమించాలనేది తమ లక్ష్యమని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతామనీ స్పష్టం చేస్తూ వచ్చారు. మూడు రాజధానులకు సంబంధించి బిల్లుల్లోని ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించేలా మరింత మెరుగైన బిల్లును తెస్తామని వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
Recommended Video

త్వరలో మంత్రివర్గం..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. ఈ నెల మూడోవారం లేదా నాలుగో వారంలో మంత్రివర్గాన్ని సమావేశపరుస్తారని అంటున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు, వార్షిక బడ్జెట్ కేటాయింపులను నిర్ధారించే విషయంపై చర్చిస్తారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే రోజే వార్షిక కేటాయింపులను మంత్రివర్గం ఆమోదిస్తుంది. అదే రోజే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications