హ్యాట్రిక్‌పై కన్నేసిన వైసీపీ: టీడీపీ అడ్డుకుంటుందా?
Santhanuthalapadu Assembly round up 2024: బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం.. సంతనూతలపాడు. నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఎస్సీ ఓటుబ్యాంకు భారీగా ఉంటుందిక్కడ. ఆ తరువాత రెడ్లు, కాపులు, యాదవులు ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు నాలుగు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగింట్లో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.1962 ఎన్నికల్లో సీపీఐ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్ధి తవనం చెంచయ్య విజయం సాధంచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మూడుసార్లు ఈ నియోజకవర్గాన్ని దక్కించుకుంది.

రెండుసార్లు టీడీపీ, టీడీపీతో పొత్తుపెట్టుకుని సీపీఐ ఒకసారి సంతనూతలపాడులో జెండా ఎగురవేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతోంది.
1989లో గెలిచిన జీవీ శేషు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. సంతనూతలపాడు నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కడం అదే తొలిసారి. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా దారా సాంబయ్య విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెసే ఇక్కడ ఢంకా మోగించింది.
కాంగ్రెస్ అభ్యర్ధి బీఎన్ విజయకుమార్.. టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సీపీఎం అభ్యర్ధి జే అంజయ్యపై 9,531 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల నాటికి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారు. టీడీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ఆదిమూలపు సురేష్ ఆయనను ఓడించారు.
2019లో కూడా వైఎస్ఆర్సీపీదే విజయం ఇక్కడ. అదే టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్‌పై వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన టీజేఆర్ సుధాకర్ బాబు 9,078 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను మార్చాయి. మేరుగు నాగార్జున ఈ సారి సంతనూతలపాడు నుంచి బరిలో దిగారు. బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్‌ను టీడీపీ రేసులో నిలిపింది. విజయం ఎవరిని వరించిందనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది.












Click it and Unblock the Notifications