సభలో 8 తీర్మానాలు, రెస్ట్ రూంకెళ్లానని జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం ఎనిమిది తీర్మానాలు చేశారు. హేతుబద్దత లేకుండా చేసిన విభజన తీరు పైన శాసన సభ అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజధానిగా విజయవాడ కేంద్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలి.
విభజన చట్టంలో పొందుపర్చిన ప్రతిపాదనలు, హామీలను కేంద్రం అమలు చేయాలి. అన్ని విధాలా ఏపీకి సాయం చేసేందుకు, సమన్యాయం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరాలి. విధనపరమైన, ఆర్థికపరమైన సాయం కేంద్రం చేయాలి. శాసన మండలి సీట్ల సంఖ్యను 58కి పెంచాలని తీర్మానాలు చేశారు.
చంద్రబాబు ప్రకటన పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మాట్లాడారు. రాజధాని పైన ప్రకటన తర్వాత చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. శాసన సభ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్లారు. దీనిని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాజధాని పైన చర్చ జరగాలి, అభిప్రాయం చెప్పాలి అంటూ డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు సభ నుండి వెళ్లారని, ఆయన ఎక్కడకు వెళ్లారో తెలియదని, కానీ, డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు చల్లగా జారుకున్నారన్నారు.
అనంతరం కాసేపటికి సభలోకి జగన్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను రెస్ట్ రూంకు వెళ్లానని, విశ్రాంతి గదికి వెళ్లినా దానిని రాజకీయం చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రకటన తర్వాత చర్చ అంటారు. చర్చ లేకుండా ప్రకటన చేస్తారని విమర్శించారు. దీనిపై యనమల మాట్లాడుతూ.. విశ్రాంతి గదికి నిజంగా వెళ్తే అభ్యంతరం లేదని, కానీ, వెంట నలుగురైదుగురు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications