మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం: ఫిఫా.. తుఫాన్ ముందు ప్రశాంతత
ఫిఫా వరల్డ్ కప్ మెగా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. అత్యంత పటిష్టమైన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఫైనల్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మాజీ ఛాంపియన్లు.. ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా ఈ తుది సమరంలో తలపడనున్నాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్- 4 స్థానాల్లో ఉన్న జట్లన్నీ ఒకేసారి సెమీస్‌కు చేరడం ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది మూడోసారి మాత్రమే..
వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లూ గతంలో ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడిన దేశాలే కావడం ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు 1970, 1990లలో మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రస్తుత టోర్నీలో ఈ నాలుగు జట్లు కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా అజేయంగా సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగింట్లో స్పెయిన్, ఇంగ్లాండ్ మాత్రమే గ్రూప్ దశల్లో ఒక్కో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయి.

గ్రేట్ టైటాన్స్ మధ్యే మొదటి గేమ్
15వ తేదీన జరగబోయే మొదటి సెమీఫైనల్‌లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఫ్రాన్స్ అటాకింగ్ విభాగంలో కిలియన్ ఎంబాప్పే, ఉస్మాన్ డెంబెలే అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఈ టోర్నీ లీగ్స్, రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16లో చెరో అయిదు గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా మారారు. ఈ టోర్నీలో ఫ్రాన్స్ ఇప్పటివరకు అత్యధికంగా 16 గోల్స్ చేసింది. స్పెయిన్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోవట్లేదు. 11 గోల్స్‌తో దూసుకుపోతోంది.
నాటి గేమ్ లో..
మరోవైపు ఇరు జట్ల డిఫెన్స్ విభాగాలు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాయి. అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాయి. ఈ టోర్నీలో స్పెయిన్ ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గోల్ సమర్పించుకుందంటే.. ఈ జట్టు డిఫెన్స్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీగ్స్, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ లల్లో ఫ్రాన్స్ రెండు గోల్స్ చేసుకునే అవకాశం మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చింది. గత ఏడాది నేషన్స్ లీగ్ సెమీ ఫైనల్స్ లో చివరిసారిగా ఫ్రాన్స్, స్పెయిన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో స్పెయిన్ 5-4తో విజయం సాధించింది. ఇప్పుడిక ఫిఫాలో కూడా అదే రిపీట్ అవుతోంది. మళ్లీ ఈ రెండు జట్లే ఢీకొనబోతోన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.
ఇంగ్లాండ్ తో అర్జెంటీనా..
రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్లు ముఖాముఖి తేల్చుకోనున్నాయి. ఇంగ్లాండ్ జట్టు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ వంటి అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో ఎంతో బలంగా కనిపిస్తోంది. టోర్నీలో మెక్సికో, నార్వే వంటి కఠినమైన జట్లను ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ విజయవంతంగా సెమీస్ చేరింది. మరోవైపు ప్రీ క్వార్టర్స్ లో లాటారో మార్టినెజ్ అద్భుత ప్రదర్శనతో స్విట్జర్లాండ్ అడ్డంకిని దాటుకుని సెమీస్ చేరుకుంది అర్జెంటీనా. చివరి నిమిషాల్లో మాత్రమే ఆధిక్యాన్ని సాధించగలిగిందీ డిఫెండింగ్ ఛాంపియన్.
సీట్ ఎడ్జ్ మ్యాచ్..
అర్జెంటీనాకు అట్లాంటాలో లభించే మద్దతు గట్టిగా కలిసిరానుంది. అటాకింగ్ వింగ్స్‌లో స్పెషలిస్ట్ ఆటగాడు ఏంజెల్ డి మారియా లేకపోవడం అర్జెంటీనా ఎదురుదాడిపై కొంత ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ.. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఏ క్షణంలోనైనా అద్భుతాలు సృష్టించగలడు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగలడు. పటిష్టమైన డిఫెన్స్, అటాకింగ్ వ్యూహాలు ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications