వ్యాఖ్యలపై తగ్గని జగన్: అసెంబ్లీలో టిడిపి ఆందోళన
హైదరాబాద్: తెలుగుదేశం సభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. అధికార పక్ష సభ్యులు బఫూన్లంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శాసనసభలో మరోసారి దుమారం చెలరేగింది.
సభలో జగన్ క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి సభ్యులు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ కార్యక్రమాలు స్తంభించడంతో శాసనసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతున్న సమయంలో జగన్ సభలోకి వచ్చారు. ఈ సమయంలో అధికార పక్ష నేతలను బఫూన్లన్న జగన్ సభలో క్షమాపణ చెప్పాలని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

టిడిపి సభ్యులకు స్పీకర్ కోడెల సర్దిచెప్పేందుకు యత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. భాన్ కిరణ్, కృష్ణ తెలుసా అని తాను జగన్‌ను అడిగానని, అలా అడిగితే తమను బఫూన్లంటూ వ్యాఖ్యానిస్తారా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టిడిపి సభ్యుల ఆందోళనకు ప్రతిగా వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు నినాదాలు చేశారు.
జగన్ క్షమాపణ చెప్తే సభకు గౌరవమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రులు, స్పీకర్లూ గతంలో క్షమాపణలు చెప్పిన ఘటనలు ఉన్నాయని, జగన్ క్షమాపణ చెప్పడానికి సంశయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఆంధ్రకేసరికి బాబు నివాళి
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నగరంలోని రవీంద్రభారతి వద్ద ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications