సింగపూర్‌లో వైద్యం చేయిస్తే: జగన్, మేం కూడా వస్తాం..
హైదరాబాద్: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి బాధాకరమని, ఆయన కోరిక మేరకు సింగపూర్‌లో వైద్యం చేయించి ఉంటే బతికేవారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శాసన సభలో అన్నారు. వెంకటరమణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఆయన కిందిస్థాయి నుండి ఎదిగిన వ్యక్తి అన్నారు. తిరుపతి ప్రజలకు, టీడీపీకి తీరనిలోటు అన్నారు. సహనానికి మారుపేరు వెంకటరమణ అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావించేవారని, ఎవరినీ ఇబ్బంది పెట్టకపోయేవారన్నారు. ఆయన 40వేలకు పైగా మెజార్టీతో గెలిచారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
అనంతరం జగన్ తనకు మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. మాట్లాడాలని తనను కోరలేదని ఆవేదన వ్యక్తే చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి సభాపతి మీరేనని, సంప్రదాయాలు పాటించాలని కోడెల శివప్రసాద రావును ఉద్దేశించి అన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదన్నారు. ఎప్పటికీ టీడీపీయే అధికారంలో ఉండదన్నారు.

తాము కూడా భవిష్యత్తులో అధికారంలోకి వస్తామన్నారు. అప్పుడు టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు.
ప్రతిపక్షాన్ని కించపరిచేలా వ్యవహరించవద్దన్నారు. ప్రతిపక్ష నేతగా సంతాపం తెలిపే హక్కు తనకు లేదా అన్నారు. వెంకటరమణ మృతి బాధాకరమన్నారు. వైయస్ నాయకత్వంలో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు.
పెషావర్ మృతులకు సంతాపం
పెషావర్ మృతులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ ఘటనను అన్ని పార్టీలు ఖండించాయి.
కాగా, అంతకుముందు శీతాకాల సమావేశాలను ఈ నెల 26 వరకు పొడిగించాలన్న వైసీపీ ప్రతిపాదనను టీడీపీ సర్కారు తోసిపుచ్చింది. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల పొడిగింపునకు విపక్షం పట్టుబట్టింది.
కేవలం ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఎక్కడుందని విపక్షం తరపున భేటీకి హాజరైన జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
అయితే, వివిధ కారణాల రీత్యా సమావేశాల పొడిగింపు ఎంతమాత్రం కుదరదని ప్రభుత్వం చెప్పింది. సమావేశాలు జరిగినన్ని రోజుల్లోనే ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ప్రభుత్వం విపక్షానికి సూచించింది. సభకు హాజరయ్యే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. కాగా, సభ ఎల్లుండికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications