విభజన ఎఫెక్ట్: 200 మంది ఉద్యోగులు తెలంగాణకు?
హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. తెలంగాణకు చెందిన 200 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం చూపనుంది. ఈ శాఖలో ఇంజనీర్ల సీనియారిటీ, పదోన్నతులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో కొట్టేసింది.

దీంతో ఈ జీవోల ఆధారంగా రెండు రాష్ట్రాల్లో ఇచ్చిన పదోన్నతులన్నీ రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ నుంచి బదిలీ చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇలా గనుక జరిగితే ఏపీ నీటిపారుదల శాఖలోని 2, 3వ జోన్లకు చెందిన ఇంజనీర్లకు పదోన్నతులు లభిస్తాయి. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటే 1975నుంచి సీనియారిటీ లెక్కలు వేసుకుంటూ వచ్చి, కొత్త సీనియారిటీ జాబితాను జోన్లవారీ తయారు చేయాల్సి ఉంది.
ఈ విషయంపై ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను గురువారం జోన్ 1,2,3లలో ఉన్న ఇంజనీర్లు కలిశారు. తమను తిరిగి తెలంగాణకు పంపవద్దని అలా చేస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని విన్నవించారు.
ఇలా తమను పంపితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన తమను తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని, తామంతా గాల్లో ఉండిపోవల్సి వస్తుందని వారు కార్యదర్శికి వివరించినట్లు తెలుస్తోంది. అక్కడ రాజకీయ పరిస్ధితులు, రాజకీయ యంత్రాంగం వ్యాఖ్యల కారణంగా తాము అక్కడ పని చేయలేమని తమకు ఏపీలోనే ఉండి ఉద్యోగం చేసుకునేలా చూడాలని కోరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications