నేను ఉన్నాను.. ఉద్యమానికి సిద్దం - జగన్ కీలక ప్రకటన..!!
మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పైన ఉద్యమానికి సిద్దమని వెల్లడించారు. ఆక్వా రైతుల సమస్యల పైన ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకూ ఒత్తిడి పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రైతాంగం మద్దతు ధరలు లేక సమస్యల్లో ఉందని.. వారికి వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఆక్వా రైతులకు మాజీ సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించిన జగన్... ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ తాము పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా నిలిచామని, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించక రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్నారని... దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

రైతాంగానికి మద్దతుగా ఉద్యమానికి సిద్దం
ఆక్వా రంగాన్ని నమ్ముకున్న రైతులను, కూలీలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని జగన్ విమర్శించారు. గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ, విద్యుత్ రాయితీలు సక్రమంగా అందించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని, ఆక్వా రైతుల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నా రని ఆరోపించారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారని, చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఫీడ్ రేట్లు కేజీకి రూ.14 నుంచి 16కి ఎడాపెడా పెంచేశారని, ముష్టి వేసినట్టు కేజీకి రూ.2 తగ్గిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. రేట్లు పెంచితే పెంచేస్తారని... రేట్లు తగ్గితే తగ్గించరా అని ప్రశ్నించిన జగన్.. వారి సమస్యలకు తాను తెలుసని.. తాను ఉన్నానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications