వైఎస్ జగన్ లో వైనాట్ 175 ధీమా - అసలు కారణం అదేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తోంది. మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఈసారి ఏకంగా 175కు 175 సీట్లు గెల్చుకోవాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టేశారు. అంతే కాదు వైనాట్ 175 అంటూ మొత్తం సీట్లు ఎందుకు గెల్చుకోలేమనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు. తద్వారా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏదో మూల ప్రజా వ్యతిరేకతపై ఉన్న భయాల్ని తొలగించి వారిని ఈసారి 175 సీట్లూ గెల్చుకోబోతున్నామని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలతో అసలు అసెంబ్లీలో 175 సీట్లూ గెల్చుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ వైనాట్ 175 అని ఎలా చెప్పగలుగుతున్నారో కారణాన్ని ఆమె వెల్లడించారు. వైఎస్ జగన్ ఇంత ధీమాగా ఉండటం వెనుక కారణం ఇదేనని ఆమె చెప్పుకొచ్చారు. దానికి కౌంటర్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

విజయవాడలో గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పురందేశ్వరి.. వైఎస్ జగన్ వైనాట్ 175 ధీమా వెనుక దొంగ ఓట్ల నమోదే కారణమన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. తాజాగా తిరుపతి ఉపఎన్నికల్లోనే 35 వేల దొంగ ఓట్ల నమోదు బయటపడిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఏం చేయబోతున్నారో తేలిపోయిందన్నారు. అయితే ఈ అక్రమాలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పురందేశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications