బీజేపీలోకి కిరణ్ ఎంట్రీపై సోము వీర్రాజు రియాక్షన్ ఇదే..
ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉంటున్న ఏపీ బీజేపీలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ స్ధాయి నేతలే బీజేపీలో చేరుతుండగా.. ఇవాళ ఏకంగా ఓ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు రాష్ట్రస్ధాయిలో బీజేపీని నడిపిస్తున్న వారందరిలోనూ గుబులు మొదలైంది. అసలే రాష్ట్రస్ధాయిలో నేతలతో సంబంధంలేకుండానే తనకున్న పరిచయాలతో నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరిన కిరణ్ పై పార్టీ రాష్ట్ర ఛీఫ్ సోము స్పందించారు.
బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీపై ఇప్పటివరకూ పెద్దగా మాట్లాడని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ మాత్రం స్పందించారు. కిరణ్ చేరికను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. కిరణ్ కు ఉదయం ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు సోము తెలిపారు. త్వరలో కిరణ్ తో భేటీ అయి రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చించబోతున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో సోము చెప్పినట్లయింది.

మరోవైపు బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని సోము వీర్రాజు తెలిపారు. కిరణ్ చేరికతో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు తెలిపారు. వాస్తవానికి ఏపీలో సోము వీర్రాజు హయాంలో కాపుల పార్టీగా పేరు తెచ్చుకుంటున్న బీజేపీలోకి కిరణ్ ఎంట్రీతో రాజకీయం వేడెక్కబోతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో రెడ్ల పార్టీ వైసీపీ అధికారంలో ఉండటంతో దాన్ని ఢీకొట్టేందుకు మరో రెడ్డిని తీసుకొస్తే మంచిదని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే 2014 తర్వాత యాక్టివ్ గా లేని కిరణ్ ను వెతుక్కొచ్చి మరీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే కిరణ్ కు పార్టీలో ఎలాంటి పదవి ఇస్తారన్న దానిపై భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications