వాలంటీర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ ? బీజేపీ కొత్త డిమాండ్-లేకుంటే తిరగబడాలని సూచన..!
ఏపీలో వాలంటీర్లపై ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా విమర్శలు చేయడం మొదలుపెట్టాక వైసీపీ కాస్త డిఫెన్స్ లో పడిందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా ఇవాళ స్వరం పెంచారు. వాలంటీర్లపై ఇప్పటివరకూ కాస్త చూసీ చూడనట్లుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు వాలంటీర్లతో పాటు వైసీపీకి కూడా ఓ సవాల్ విసిరారు.
వాలంటీర్లపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న వైఎస్ఆర్‌సీపీ పెద్దలు.. వారిపై అంత ప్రేమ ఉంటే.. నిజాయితీ ఉంటే తక్షణం ఆ వ్యవస్థను.. పర్మినెంట్ చేయాలని బీజేపీ నేత విష్ణు వర్ఘన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఎక్కడలేని ప్రేమను ఒలక బోయడం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే వాలంటీర్లకు కూడా ఆయన ఓ సూచన చేశారు. తమను ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయకపోతే వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడాలని విష్ణు పిలుపునిచ్చారు.

పరిపాలించమని ప్రజలు ఆధికారం ఇస్తే వారి దగ్గరున్న అధికారాలన్ని లాగేసుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఖచ్చితంగా ప్రజాద్రోహమేనని విష్ణు తెలిపారు. ఏపీలో నాలుగేళ్ల వైసీపీ పాలన గురించి చెప్పే వైసీపీ నేతలు 151 ఎమ్మెల్యేల బలం ప్రజలు ఇచ్చారని చెబుతున్న మాటలు వింటుంటే విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న ధోరణిని చూస్తే బాధేస్తుందన్నారు. సర్పంచుల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.అలాగే రూ. 7650 కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి ఏం చేశారో శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
మరోవైపు రాజధాని అమరావతి లో పేదలకు 50 వేల ఇళ్ళు ఇవ్వాలని కొత్త తరహా మోసానికి తెరలేపారన్నది నిజమని విష్ణు ఆరోపించారు. ఓట్ల కోసం నేడు అమరావతి లో ఇల్లు డ్రామాలు ఆడుతున్నారని, అమరావతి రైతులకు ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులు, వారి హక్కులను గుర్తించని మీ ప్రభుత్వానికి వారి భూములను ఉపయోగించుకోనే హక్కు ఎక్కడ నుంచి వస్తుందన్నారు. సీఎం సొంత నియోజకవర్గం లో ఇప్పట్టివరకు ఇళ్లను పూర్తి చేయలేని ముఖ్యమంత్రి పేదలకు 50వేల ఇళ్లను ఇస్తామంటే పేదలు నమ్ముతారా అని విష్ణు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications