మూడు పార్టీలు కలుస్తాయి - పవన్ కలత చెందారు : బీజేపీ నేతల సంచలనం..!!
ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీతో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన లాంఛనంగానే మారింది. ఈ ఇద్దరితో బీజేపీ కలిసే అంశం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రెండు పార్టీల అధినేతలు సైతం బీజేపీ తమతో కలిసి రావటం పైనే వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఈ ఇద్దరి నేతల భేటీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూడు పార్టీల కలుస్తాయంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
పవన్ ఎవరినైనా కలవచ్చు:చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. జనసేన తమ మిత్రపక్షమైనా జనసేన ఒక స్వతంత్ర పార్టీగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి ఆయన కలత చెందారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది పవన్ ప్రయత్నంగా సత్యకుమార్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదన్నారు. తిరోగమనంలో నడుస్తున్న రాష్ట్రాన్ని పురోగమనంలోకి తీసుకురావడంపై జనసేన, బీజేపీ చర్చిస్తున్నాయని వివరించారు. ఈ అంశాలపైనే పవన్, బాబు మధ్య చర్చలు జరిగి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు.

బీజేపీ నేతలతో పవన్ చర్చించారు:ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో పవన్ మాట్లాడారని సత్యకుమార్ గుర్తు చేసారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కలిగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జనసేన, బీజేపీ భావిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంపై చార్జిషీటు దాఖలు చేయడానికి 11 మంది సభ్యుల మొదటి సమావేశం జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. శిశుపాలుడి నేరాల లెక్కింపు క్రమంలో ఈ చార్జిషీటు కమిటీ ఏర్పడిందని వివరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబులెన్సుల కొనుగోలులో రూ 150 కోట్ల మేర అక్రమాలు జరిగాయాని సత్యకుమార్ ఆరోపణలు చేసారు. ఈ నాలుగేళ్లలో ఇలాంటివి అనేకం జరిగాయని చెప్పుకొచ్చారు.
మూడు పార్టీలు కలిసే ముందుకు:రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే క్రమంలోనే పవన్ - చంద్రబాబు, పవన్ - ప్రధాని మోదీల భేటీ ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు. తాజాగా చంద్రబాబు - పవన్ మధ్య జరిగిన సమావేశంలోనూ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలనే వ్యూహం పైన చర్చ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతల ప్రతిపాదనకు బీజేపీ అధినాయకత్వం నిర్ణయం ఆధారంగా ఏపీలో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications