సరిగ్గా గెలిచే సమయంలో 'బురద'లో కాలేస్తున్న తోట చంద్రశేఖర్!
భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అఖిల భారత సర్వీసు అధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపారాల్లోకి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాపు సామాజికవర్గానికి చెందిన తోటకు తన సామాజికవర్గంపై ఎనలేని అభిమానం ఉంటుంది. సాధ్యమైనంతవరకు తనకు చేతనైనంతన సాయం చేస్తుంటారు.

ప్రజారాజ్యం, వైసీపీ నుంచి ఓటమి
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తన సొంత నియోజకవర్గం గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేశారు. తీవ్రమైన పోటీనిచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా వేర్వేరు పార్టీల్లో చేరారు. అలాగే తోట కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసినప్పటికీ మాగంటి బాబు చేతిలో ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ లో వ్యాపారాలు నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలోకి మారారు.

జనసేన పార్టీ నుంచి మూడో ఓటమి
జనసేనలో ఈసారి ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకున్నారు. గాజుగ్లాసు గుర్తుపై ఎన్నికలు జరిగే చివరి వారం రోజుల ముందు వరకు గట్టి ప్రత్యర్థిగా నిలిచినప్పటికీ మూడోస్థానంలో నిలిచారు. తర్వాత కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి ఏపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటే 2019 ఎన్నికల్లో ఎంపీగానైనా, ఎమ్మెల్యేగానైనా చాలా సులువుగా విజయం సాధించేవారు. కానీ అక్కడి నుంచి జనసేనలోకి వచ్చారు.

పొత్తు పెట్టుకోబోతున్న తరుణంలో..
జనసేన-తెలుగుదేశం పొత్తు పెట్టుకొని పోటీచేయబోతున్న తరుణంలో మరోసారి పార్టీ మారారు. పవన్ కల్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తూ, 99 టీవీద్వారా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్న తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడంపై అనేకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట, ఏదో ఒక నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో జనసేన తరఫున అలవోకగా విజయం సాధించేవారు. భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతారా? లేదంటే మరే పార్టీ అయినా మారతారా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications