అమరావతిపై కేబినెట్ కీలక నిర్ణయాలు- భూసమీకరణలో ట్విస్ట్, 7500 కోట్ల లోన్..!
ఏపీ రాజధాని అమరావతిపై ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రైతులతో నిన్న జరిపిన సమావేశంలో చర్చించిన మేరకు రాజధాని పరిధి విస్తరించేందుకు వీలుగా రెండో దశ భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు అమరావతి నిర్మాణం కోసం 7500 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.
రాజధాని అమరావతి కోసం గతంలో 33 వేల ఎకరాలు భూసమీకరణ చేశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో విడత భూసమీకరణకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. ఈసారి 16 వేల 666 ఎకరాల్లో భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీయే పంపిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణను మొత్తం 7 గ్రామాల్లో చేయాలని నిర్ణయించారు. రెండో విడతలో 40 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావించినా పలు గ్రామాల్లో అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం 16 వేల ఎకరాలకే సరిపెట్టినట్లు తెలుస్తోంది.

అమరావతిలో రెండో విడత భూసమీకరణ జరిపే గ్రామాల్లో ఇప్పటికే అంగీకారం తెలిపిన వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి భూసమీకరణకు రైతుల్ని ఒప్పించారు. ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలపడంతో త్వరలో సీఆర్డీయే ఆయా గ్రామాల్లో భూసమీకరణ ప్రారంభించనుంది. ఆయా రైతులకు తొలి విడత తరహాలోనే ప్యాకేజీలు, ప్లాట్లు ఇస్తారు.

మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో విడతగా రూ.7500 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీయే నుంచి వచ్చిన ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి ఈ రుణం సేకరించబోతున్నారు. ఈ నిధుల్ని రాజధాని అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయాలని సీఆర్డీయే షరతు విధించారు. సీఆర్డీయే ఈ మొత్తం రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండనుంది.












Click it and Unblock the Notifications