AP Cabinet: ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ-కారణమిదే..!
ఏపీ మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించాల్సిన ఓ అంశానికి సంబంధించి చర్చించేందుకు కేబినెట్ భేటీ అయింది. అయితే మరికొన్ని ఇతర అంశాలు కూడా ఇందులో చర్చించనున్నారు. అలాగే నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కు అభినందనలు తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఇవాళ్టి కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్ధితిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం అమెరికా, రష్యా నుంచి వచ్చిన నిపుణులతో ఈ ప్రాజెక్టులో ఎదురైన సమస్యను అధ్యయనం చేయించారు. ఆ తర్వాత వారు ఇచ్చిన నివేదిక ప్రకారం పాడైన డయాఫ్రమ్ వాల్ ను మరోసారి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి వెంటనే ఆమోద ముద్ర వేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు వీలుగా ఇవాళ కేబినెట్ సమావేశమైంది.

ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ ఉంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన ఇవ్వాల్సి ఉంది. దీని కోసం కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ అత్యవసరంగా కేబినెట్ భేటీ అయి దీనిపై చర్చిస్తోంది. ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిపాదనను నీతి ఆయోగ్ భేటీలో పెట్టి ఆమోదం తీసుకుంటారు. పోలవరం చర్చ తర్వాత మరికొన్ని అంశాలపైనా కేబినెట్ చర్చించనుంది.












Click it and Unblock the Notifications