ఏపీ కేబినెట్ భేటీ వాయిదా .. మార్చి 7నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మార్చి 3న జరగాల్సిన ఈ భేటీని వాయిదా వేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రివర్గ సమావేశాలను తిరిగి మార్చి 7న నిర్వహించనున్నట్లు తెలిపింది. కేబినెట్ బేటీకి సంబంధించిన మార్పులను సూచిస్తూ అన్ని శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేసింది.

గౌతమ్ రెడ్డి పెద్ద ఖర్మ దృష్ణా..
దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన మార్చి 7వ తేది నుంచి ప్రారంభం అవుతాయి. తొలి రోజు శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

మార్చి 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్
మార్చి 11న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సుమారు 2.40 లక్షల కోట్ల రూపాయాలుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి, నాడు-నేడు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టినందున విద్యారంగానికి భారీగానే నిధులు కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట
రాష్ట్రంలో విద్యాతో సమాంతరంగా వైద్యానికి కూడా జగన్ ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అనుగుణంగా నిధులు కేటాయింపులు ఉంటాయని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈసారి భారీగానే నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇన్ పుట్ సబ్సీడీ , ఉచిత బోర్లు, రైతు భరోసా వంటి పథాకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికీ నిధులు మంజూరు చేయనుంది.












Click it and Unblock the Notifications